టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సముద్రాల క్రాంతి కుమార్
భద్రాద్రి టైమ్స్, కొత్తగూడెం, అక్టోబర్ 3 : తెలంగాణలో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కేవలం తెలంగాణ రక్షణ సేన ద్వారానే సాధ్యమని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సముద్రాల క్రాంతి కుమార్ అన్నారు. ఇటీవల జిల్లా అధ్యక్ష భాద్యతలు చేపట్టిన ఆయన జిల్లాకు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యానగర్ నుండి ర్యాలీగా బయలుదేరి పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో అంబేద్కర్ కు పూలమాల వేసిన అనంతరం, బస్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్తూపం వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరుల త్యాగాలను గుర్తు చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు పాంచజన్య పథకాల అమలు కోసం రాబోయే రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ ఏర్పాటు అవసరమని అందుకు జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపచేయడమే ప్రధానంగా ముందుకు వెళ్తామన్నారు.
పాంచజన్యమే కార్యాచరణకు పునాది
తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన ‘పాంచజన్యం’ ఐదు ప్రధాన అంశాల చుట్టూ పార్టీ కార్యాచరణను రూపొందిస్తోందని ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయాన్ని ప్రధాన లక్ష్యాలన్న ఆయన ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమతో కలిసి వచ్చే యువతకు పార్టీలో అవకాశం ఇస్తామన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణం, మండలంలో పార్టీ విస్తరణకు చర్యలు తీసుకుంటామని యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులను పార్టీతో అనుసంధానం చేస్తూ కేడర్‌ను సమన్వయం చేసుకుంటామని ఆయన వెల్లడించారు. సింగరేణి కార్మికుల సమస్యలతో పాటు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, యువతకు ఉపాధి, రైతుల సమస్యలు, కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టిఆర్.టియు రాష్ట్ర అధ్యక్షులు డి వీరన్న, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చైతన్య, కార్మిక విభాగం జిల్లా నాయకులు వాంకుడోత్ రవి, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు లకావత్ సురేష్, ఇల్లందు ఇంచార్జి రామకృష్ణ, అశ్వారావుపేట ఇంచార్జి, సోడెం వెంకట్, జిల్లా నాయకులు ముసలం రామకృష్ణ,ఖలీల్, పృథ్వీ రాజ్, పవన్ నాయక్, ఆది, రాంబాబు, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.








