తాళం వేసిన ఇంటిలో చోరీ.. 9.5 తులాల బంగారం, 1.6 కిలోల వెండి, రూ.50 వేల నగదు అపహరణ
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిలో భారీ చోరీ చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దొంతుల సోమలింగం మోకాళ్ల శస్త్రచికిత్స నిమిత్తం తన భార్యతో కలిసి ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం ఈ నెల 8వ తేదీన ఆయన చిన్న కుమారుడు దొంతుల ప్రణయ్ కూడా ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లాడు.శుక్రవారం (జూలై 10) రాత్రి సుమారు 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి రాగా, ఇంటి ప్రధాన తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువాను పరిశీలించగా, అందులో భద్రపరిచిన 9.5 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 1.6 కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు తెలిసింది.బాధితుల ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్‌ను రప్పించి శాస్త్రీయ ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సమీప పోలీస్ స్టేషన్‌కు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.










