అర్ధరాత్రి మట్టి మాఫియాపై పోలీసుల నిఘా
అక్రమ మట్టి తరలింపు వాహనాలు పట్టివేత
అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు.. హిటాచి, నాలుగు టిప్పర్లు స్వాధీనం
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ పోలీస్ నిఘా పెంచారు. ఆలింపూర్ గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో అనుమతులు లేకుండా భారీగా మట్టి తవ్వి తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో బచ్చన్నపేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ఒక హిటాచి, నాలుగు టిప్పర్ వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు, బాధ్యుల వివరాలను తదుపరి చర్యల నిమిత్తం బచ్చన్నపేట ఎంఆర్వోకు లేఖ ద్వారా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు, మట్టి–ఇసుక అక్రమ రవాణా, గుట్కా, పేకాట తదితర అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో అక్రమ కార్యకలాపాలను అరికట్టి “మంచి బచ్చన్నపేట–మంచి సమాజం” నిర్మాణానికి సహకరించాలని కోరారు.









