బైక్‌ను ఢీకొట్టి దొరకకుండా పారిపోయిన కారు..
చేజింగ్ చేసి పట్టుకున్న బచ్చన్నపేట పోలీసులు
మన సాక్షి గొంతుక – బచ్చన్నపేట మండలంలోని అలింపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 365పై ఆదివారం రాత్రి హిట్ అండ్ రన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అలింపూర్ గ్రామానికి చెందిన పరుపల్లి బాలయ్య (42) తీవ్రంగా గాయపడ్డారు.బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో బాలయ్య తన మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా జనగామ వైపు వేగంగా వెళ్లిపోయింది.సమాచారం అందుకున్న బచ్చన్నపేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు గాలింపు చేపట్టారు. పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి జనగామ వద్ద మారుతి స్విఫ్ట్ కారును గుర్తించి చేజింగ్ చేసి పట్టుకున్నారు.ప్రమాదానికి కారణమైన వాహనం TG-27-A-3074గా పోలీసులు తెలిపారు. కారును నడిపిన షామీర్‌పేట్‌కు చెందిన చెట్లపల్లి లింగం (తండ్రి కొండయ్య)ను అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.కారు ఢీకొనడంతో బాలయ్య కాలుకు రెండు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.హిట్ అండ్ రన్ ఘటన జరిగిన వెంటనే స్పందించి, వాహనాన్ని గుర్తించి పట్టుకున్న బచ్చన్నపేట పోలీసుల చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు.










