రైతు బీమా నిధులు వెంటనే విడుదల చేయాలి
రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం
రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడం రైతులకు ద్రోహమే
బచ్చన్నపేట మండలంలో 15 వేల మంది రైతులకు భద్రతపై ఆందోళన
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
రైతు రాజ్యం తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని బచ్చన్నపేట మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఫెరోజ్ ఆరోపించారు. 2026–27 సంవత్సరానికి రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించకుండా ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆగస్టు 13 అర్ధరాత్రితో పాత రైతు బీమా గడువు ముగిసినప్పటికీ, ప్రభుత్వం కొత్త ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతు కుటుంబాల్లో ఆందోళన నెలకొందన్నారు. బచ్చన్నపేట మండలంలో సుమారు 15 వేల మందికి పైగా రిజిస్టర్డ్ రైతులు ఉన్నారని, గత ప్రభుత్వం రైతు కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించిందని తెలిపారు.‘ఇందిరమ్మ బీమా’ పేరుతో కొత్త పథకం తీసుకొస్తామని చెబుతూ, ప్రస్తుతం ఉన్న రైతు బీమాకు ప్రీమియం చెల్లించకుండా కాలయాపన చేయడం రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమని ఫెరోజ్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు బీమా ప్రీమియం నిధులను విడుదల చేసి, ఆగస్టు 14 తర్వాత మరణించిన రైతు కుటుంబాలకు కూడా రూ.5 లక్షల బీమా సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతు కుటుంబాలకు న్యాయం చేయకపోతే వారి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఫెరోజ్ హెచ్చరించారు.










