బీఆర్ఎస్ పోరాట ఫలితం.. ఎమ్మెల్యే పల్లా చొరవతో రోడ్డు పనులకు శ్రీకారం
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండల ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం లభిస్తోంది.కొడువాటూర్ కమాన్ నుండి బచ్చన్నపేట చౌరస్తా మీదుగా ఎస్సార్ పెట్రోల్ బంక్ వరకు అధ్వానంగా మారిన రహదారి మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలకు కొంత ఊరట లభించనుంది.గత కొంతకాలంగా రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి రహదారిపై ప్రయాణించడం కష్టంగా మారింది. ఈ సమస్యను బీఆర్ఎస్ నాయకులు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల తరఫున సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేశారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో పాటు మంత్రులతో మాట్లాడి రహదారి మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేశారని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండీ ఫిరోజ్ తెలిపారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించడం, నిధుల మంజూరుకు కృషి చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన పోరాటానికి ఫలితంగానే రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.రోడ్డు పనులు పూర్తయితే బచ్చన్నపేట నుంచి కొడువాటూర్ కమాన్, ఎస్సార్ పెట్రోల్ బంక్ వైపు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. నిత్యం ఈ రహదారిపై ప్రయాణించే ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి.అధికారులు రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రహదారి పనులు పూర్తయి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.










